రెండు రోజులు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ చూసేయండి

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తన చందాదారులు కాని వారికి ఓ రెండు రోజులపాటు పూర్తి ఉచిత వీక్షణ సదుపాయం కల్పిస్తోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ తన వ్యాపారం ప్రత్యర్థులైన అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జీ 5 ల పోటీని ఎదుర్కొనే క్రమంలో భారతదేశంలోని వినియోగదారులకు తాజా ఆఫర్ ప్రకటించింది. డిసెంబరు 5, 6 తేదీల్లో ‘స్ట్రీమ్ ఫెస్ట్’ పేరుతో ఉచిత ఆఫర్ అందుబాటులోకి తెస్తోంది.

వీకెండ్ ఫుల్ ఎంజాయ్

నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కంటెంట్) మోనికా షెర్గిల్ తెలిపిన వివరాల ప్రకారం… డిసెంబరు తొలి వారాంతం పూర్తిగా ఈ ఉచిత ఆఫర్ అందుబాటులో ఉంటుంది. డిసెంబరు 5వ తేదీ తెల్లవారుజాము 1 గంట నుంచి 6వ తేదీ రాత్రి 11.59 వరకు నెట్ ఫ్లిక్స్ ఉచితంగా చూడవచ్చన్నమాట. అంటే 4వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి 6వ తేదీ ఆదివారం అర్ధరాత్రి వరకు సినిమాలు… వెబ్ సిరీస్ లు… ఇలా ఏది కావాలన్నా పైసా ఖర్చు లేకుండా చూసేయచ్చు. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకే ఈ ఆఫర్ ప్రవేశపెడుతున్నట్లు నెట్ ఫ్లిక్స్ చెబుతోంది. ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ ఖాతా లేనివారు ఈ రెండు రోజుల్లో తమ పేరు, మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్ ఉపయోగించి ఉచితంగానే సైన్ అప్ కావచ్చని మోనికా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.