తెల్లదొరల గుండెల్లో దడ పుట్టించి వారిని మూడు చెరువుల నీరు తాగించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగువారి వీరత్వానికి, ధీరత్వానికి గర్వకారణుడు. అంతటి మహానుభావుడిని చూసిన ఓ వ్యక్తి నిన్నటివరకు బతికే ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. ఆయనే తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని కొండపల్లికి చెందిన శతాధిక వృద్దుడు భీరబోయిన బాలుదొర. వృద్దాప్య అనారోగ్య కారణాలతో ఆదివారం తన నివాసంలో మరణించారు. 1924 మే నెలలో కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామరాజు బ్రీటీషు వారిపై చివరి పోరాటం చేసిన సమయంలో ఎత్తయిన కొండలపై ఉండేవారు. అప్పట్లో బాలుడిగా ఉన్న తను గ్రామస్తులతో కలిసి వెళ్లి అల్లూరి సీతారామరాజుకు ఆహార పదార్థాలు అందించానని బాలుదొర తరచూ చెబుతుండేవారని స్థానికులు తెలిపారు. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిందంటూ ఆయన ఎప్పుడు గర్వంగా గుర్తు చేసుకునేవారని పేర్కొన్నారు. బాలుదొర మరణానికి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు, అల్లూరి చరిత్ర పరిశోధకుడు పడాల వీరభ్రదరావు సంతాపం తెలిపారు.