యూట్యూబర్ పై రూ. 500 కోట్లకు అక్షయ్ కుమార్ పరువు నష్టం దావా

సుశాంత్ మృతి కేసులో తప్పుడు వార్తల ప్రసారం
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో భాగంగా తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ ఓ యూట్యూబర్ పై రూ. 500 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. సుశాంత్ కేసులో మహారాష్ర్ట సీఎం ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరేల పేర్లను కేసులోకి లాగుతూ… తప్పుడు వార్తలను వ్యాప్తి చేశాడన్న ఆరోపణలపై ‘ఎఫ్ ఎఫ్ న్యూస్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న రషీద్ సిద్ధిఖిని అంతకు ముందే పోలీసులు అరెస్టు చేశారు. సుశాంత్ కేసులో నిందితురాలైన రియా చక్రవర్తి కెనడా పరారవడానికి అక్షయ్ కుమార్ కు సాయం చేశాడని, సుశాంత్ మృతిపై ఉద్ధవ్, ఆదిత్య థాకరేలతో రహస్యంగా మాట్లాడాడని సిద్ధిఖి తన యూట్యూబ్ వీడియోల్లో ఆరోపించాడు. తన ఛానెల్ కు ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి అతడు సుశాంత్ మృతి కేసును ఉపయోగించుకున్నాడని పోలీసులు విచారణలో గుర్తించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ద్వారా ఆదాయం పెంచుకున్నాడని నిర్ధరించుకున్నారు. అతడి ఛానెల్ కు మే నెలలో కేవలం రూ. 296 ఆదాయం మాత్రమే రాగా, సెప్టెంబరులో అది రూ. 6.50 లక్షలకు పెరగడం గమనార్హం. కేవలం సుశాంత్ కేసుకు సంబంధించిన వార్తలతోనే గత నాలుగు నెలల్లో సిద్దిఖి రూ. 15 లక్షలకు పైగా సంపాదించాడని మిడ్ డే దినపత్రిక పేర్కొంది. గత కొన్ని నెలల్లోనే అతడి ఛానెల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య లక్ష నుంచి 3.7 లక్షలకు పెరిగింది. నిందితుడు సిద్ధిఖికి కోర్టు బెయిలు మంజూరు చేసింది. అతడు బీహార్ కు చెందిన సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.

Leave a Reply

Your email address will not be published.