రియల్ హీరో సోనూసూద్ కు తనికెళ్ల భరణి, కొరటాల శివ సత్కారం

కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా చిత్రీకరణలు నిలిచిపోయినా వార్తల్లో నిలిచిన అతితక్కువ మంది నటుల్లో సోనూసూద్ ఒకరు.  వెండితెరపై ప్రతినాయక పాత్రలు పోషించినా నిజజీవితంలో సేవాగుణంతో రియల్ హీరోగా మన్ననలు అందుకున్నారు. లాక్ డౌన్ సమయంలో కష్టాలు పడుతున్న పలువురికి సాయం చేశారు. వలస కార్మికులకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి, వారిని సురక్షితంగా సొంతూళ్లకు పంపారు. ఇంకా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సీన్ కట్ చేస్తే… మెగస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ తో నిలిచిపోగా ఇటీవలే మళ్లీ ప్రారంభమైంది. ఈ చిత్రంలో సోనూసూద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా సెట్స్ లో అడుగుపెట్టిన ఆయన్ను సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ, చిత్ర బృందంతో కలిసి సత్కరించారు. శాలువా కప్పి, జ్ఞాపిక అందించారు. ఈ ఫొటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published.