నారాయణా… నీ నామమె గతి ఇక… కోరికలు మాకు కొనసాగుటకూ…’’ అంటూ తిరుమల వాసుని రూపంలో కొలువైన శ్రీమన్నారాయణుని శరణాగతి చేసి ముక్తి పొందారు పదకవితా పితామహుడు అన్నమాచార్య. అష్టాక్షరి మంత్రంలో అంతర్భాగమైన నాలుగు అక్షరాల నారాయణ నామం ఎంతో మహిమాన్వితమైనదని సకల పురాణాలు, ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. అనంతస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్నవారికి కోరినన్ని వరాలను ఇచ్చే దయామయుడు. అందుకే ఆ స్వామిని ‘కోటివరాలదేవుడు’ అని పిలుస్తున్నారు. ఆ స్వామి నామస్మరణ సకల శుభకరం. అందుకే పోతనామాత్యుడు ఆ స్వామిని ఇలా కీర్తించాడు.
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూపులు చూపులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతులగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జితించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
…అనీ మరి తండ్రి హరిం జేరుమనియెడి తండ్రి తండ్రి
ఆ స్వామి ‘నారాయణ’ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని దుఃఖాలను దూరం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి, పరమపదానికి చేరుస్తుంది. ఇందుకు ఓ చక్కని ఉదాహరణ అజామీళుని ఉదంతమే.
పూర్వం కన్యాకుబ్జ నగరంలో అజామీళుడనే పండితుడు ఉండేవాడు. అతను కులాచారాన్ని, ధర్మాన్ని వీడి జూదము, దొంగతనము, వ్యభిచారం, దుష్కార్యాలు వంటి పనులతో భ్రష్టు పట్టాడు. కాస్తంత మంచివాళ్ళు అతని కంటబడితే చాలు, వారిని పీడించేవాడు. అతనికి పదిమంది సంతానం. వారిలో చివరివాడు నారాయణుడు. చిన్నకొడుకు నారాయణుడంటే అజామీళునికి చాలా ఇష్టం.
కాలగమనంలో వృద్ధుడైన అజామిళుడు మంచాన పడ్డాడు. అతనిని కొడుకులంతా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ, అజామిళుడు ప్రతి విషయానికి చిన్న కొడుకు నారాయణునినే పిలుస్తుండేవాడు. చివరకు అజామీళుడు తుదిశ్వాసను విడిచే సమయం ఆసన్నమవడంతో, అతడిని నరకానికి తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చి నిలబడ్డారు.
యమభటులను చూడగానే గజగజ వణికిపోయిన అజామీళుడు భయకంపితుడై తన చిన్న కుమారుని ”నారాయణా!” అని బిగ్గరగా పిలిచి ప్రాణాలను వదిలాడు.
అజామీళుడు ఎంతో పాపాత్ముడైనప్పటికీ అంత్యకాలంలో “నారాయణా!” అంటూ విష్ణు నామాన్ని స్మరించినందున అక్కడకు విష్ణుభటులు కూడ వచ్చి చేరారు. ఆ మరుక్షణమే యమభటులకు, విష్ణు భటులకు మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. అజామీళుని ఎవరు తీసుకెళ్ళాలన్న విషయమై కీచులాట మొదలైంది.
యమభటులు, విష్ణుభక్తులతో, “అయ్యలారా! ఈ పండితుడు మహాపాపి. చెప్పలేనన్ని నీచపు పనులను చేశాడు. ఒక్కరోజైనా ఓ చిన్నపుణ్యకార్యమైనా చేసి ఎరుగడు. కనీసం పూజలు, పునస్కారాలు కూడా చేసి ఎరుగడు. అటువంటి వానికి ఎలా వైకుంఠప్రాప్తి కలుగుతుంది? అతన్ని వైకుంఠానికి తీసుకెళ్ళేందుకు మీరు రావడం విచిత్రంగా ఉంది” అని అన్నారు.
యమభటుల వాదనలను విన్న విష్ణుభటులు, “యమదూతలారా! ఎంతటి పాపాత్ములైనప్పటికీ, అంత్యకాలంలో నోరారా హరినామస్మరణం చేసినట్లైతే, అప్పటివరకు అతడు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ అజామీళుడు మిమ్ములను చూడగానే, తన కొడుకును పిలిచే క్రమంలో హరినామస్మరణం చేశాడు. ఆ సంఘటన పట్ల ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు, అజామీళునికి పరమపదాన్ని అనుగ్రహించదలచి మమ్ములను పంపాడు. కనుక, మీరు అతనిని తీసుకెళ్ళడానికి కుదరదు. మీకా అధికారం లేదు. మా మాటల పట్ల నమ్మకం లేకపోతే, ఈ విషయమై మీ ప్రభువు యమధర్మరాజునే అడిగి తెలుసుకోండి” అని బదులు చెప్పారు.
ఈ విషయాన్ని యమభటులు, యమధర్మ రాజుకు వినిపించడంతో సావధానంగా విన్న యముడు, విష్ణుతత్త్వాన్ని గురించి, విష్ణుభక్తిని తన భటులకు వివరించడమే కాక, ఇకపై విష్ణుభక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు.
ఆవిధంగా ఒక్కసారి ‘నారాయణా!’ అంటూ విష్ణు నామమును ఉచ్చరించినందుకే అజామీళునికి పరమపద ప్రాప్తి కలిగింది. ఆ నామం అంతటి మహిమాన్వితమైనది.