అమ్మో… జెల్లీ ఫిష్ కుట్టేసింది

గోవా బీచ్ లలో వరుస ప్రమాదాలు

మీరేమైనా సరదాగా గోవా వెళ్తున్నారా? సరే… అక్కడ బీచ్ లో స్నానం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తండోయ్. ఎందుకంటే సముద్రంలో జెల్లీ చేపలు గుంపులుగా తిరుగుతున్నాయట. ఇటీవల అవి సుమారు 90 మంది పర్యాటకులపై దాడి చేసి కుట్టేశాయని వార్తలొచ్చాయి. అక్కడి బాగా-కాలన్ గ్యుట్ బీచ్ ప్రాంతంలోగత రెండు రోజుల్లోనే ఇలా 55 కేసులు వచ్చాయట. కాండోలిమ్ నుంచి సింక్వేరియం తీరం వరకు సుమారు 10 మందిని చేపలు కుట్టేశాయి. దక్షిణ గోవాలో 25కి పైగా జెల్లీ ఫిష్ దాడి కేసులు వెలుగులోకి వచ్చాయి. జెల్లీ ఫిష్ విషపూరిత, విషరహిత రెండు రకాలుగా ఉంటాయి. విషరహిత చేప కుడితే సాధారణంగా ప్రథమ చికిత్స చేస్తే సరిపోతుంది. కానీ ఒక్కోసారి వాటి ముళ్లు మనిషి శరీరంలో దిగబడితే రోజుల తరబడి ఇన్ఫెక్షన్ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అరుదైన సందర్భాల్లో దాని విష ప్రభావం తీవ్రంగా సోకితే బాధితులు పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంది. బాగా బీచ్ లో జరిగిన ఓ సంఘటనలో జెల్లీ ఫిష్ కాటుకు గురైన బాధితుడికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. ఛాతీనొప్పితో ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. అంబులెన్సులోనే ఆక్సిజన్ పెట్టి అతడిని ఆసుపత్రికి తరలించారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఇప్పుడిప్పుడే గోవా బీచ్ లకు సందర్శకులు పెరుగుతున్న నేపథ్యంలో జెల్లీ ఫిష్ దాడుల సంఘటనలు పెరుగుతుండడం ఆందోళనకరం.

Leave a Reply

Your email address will not be published.