బీజేపీలో చేరిన ఈటల- త్వరలోనే ఉప ఎన్నిక
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ సాక్షిగా సరికొత్త రాజకీయ పోరుకు తెర లేచింది. తెరాసకు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా ఆయన అనుచరులు ఢిల్లీకి వెళ్లి తాజాగాబీజేపీలో చేరారు. కేసీఆర్ పై ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు.
రాజేందర్ బీజేపీలోకి చేరడానికి ముందు ఆ పార్టీ నాయకత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. సాధ్యమైనంత తొందరగా హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహించాలన్నదే కీలకమైన డిమాండ్. ఎందుకంటే కేసీఆర్ కు తగినంత సమయం ఇవ్వకూడదన్నది ఈటల ఎత్తుగడ. ప్రస్తుతం తనపై ప్రజల్లోనూ, టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ సానుభూతి ఉందని ఆయన భావిస్తున్నారు. వాస్తవానికి హుజూరాబాద్ రాజేందర్ కు కొట్టిన పిండి. సామాన్య ప్రజలను పేరు పెట్టి పిలవగలిగే చనువు ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈటల నీడలో ఎదిగిన వారే. వీరిలో అత్యధికులు ఆయన వెంటే నడుస్తున్నారు. మరికొందరు ఎటూపాలుపోని స్థితి లో ఉన్నారు. వీరందరినీ చేజారిపోకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు బాధ్యతలప్పగించినా ఎంతవరకు నిలబెట్టుకోగలరో చూడాలి.
మరోవైపు టీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి లేరు. ద్వితీయ నాయకత్వం ఎదగక పోవడంతో సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. అనూహ్యంగా బీసీ మహిళా అభ్యర్థిని ఎంపిక చేయొచ్చన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారమైతే ఈటల బలంగా ఉన్నారు. ఉప ఎన్నికను తొందరగా నిర్వహిస్తే టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వొచ్చని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తోంది. ఎలాగూ పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దానితోపాటే హుజూరాబాద్ ఉప ఎన్నికనూ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ మేరకు ఈటలకు బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం.