బావిలో పడిన గున్న ఏనుగుకు 15 గంటల తర్వాత విముక్తి

క్షుద్బాధో లేక దప్పికో తీర్చుకోవడానికి ఆడవిలో నుంచి బయటకు వచ్చి పొలాల్లో తిరుగుతున్న ఏనుగుల మందలోని ఓ గున్న అదుపు తప్పి 55 అడుగుల లోతైన వ్యవసాయ బావిలో పడిపోయింది. దానిని కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. 15 గంటల శ్రమ ఫలించడంతో బావిలో నుంచి గున్న సురక్షితంగా బయటకు వచ్చింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోడు తాలూకా ఏలగుండూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అడవిలో నుంచి బయటకు వచ్చిన మూడు ఏనుగులు గురువారం తెల్లవారుజామున వెంకటాచలం అనే రైతు పొలంలో తిరుగుండగా అందులో ఓ గున్న అదుపుతప్పి 55 అడుగుల లోతైన వ్యవసాయ బావిలో పడిపోయింది. ఉదయాన్నే పొలానికి వెళ్లిన వెంకటాచలానికి ఏనుగు ఘీంకరింపులు వినిపించి ఉలిక్కిపడ్డారు. బావిలో నుంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు తెలిసి దానిని నిర్ధారించాడు. అగ్నిమాపక, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పొక్లెయిన్, క్రేన్ వంటివి ఉపయోగించి ఏనుగు పిల్లను బయటకు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 6గంటల ప్రయత్నాలు తర్వాత అటవీశాఖ వెటర్నరీ వైద్యుడి సాయంతో తుపాకీ ద్వారా ఆ ఏనుగుకు మత్తు మందు ఇంజక్షన్లు వేశారు. తర్వాత అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది సాయంతో ఆ ఏనుగుకు తాళ్లు కట్టి క్రేన్ సాయంతో రాత్రి 7 గంటలు తర్వాత బయటకు తీశారు. ఈ పనుల్లో సుమారు 50 మంది అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది, 2 క్రేన్లు, జేసీబీ యంత్రాలు ఉపయోగించడం గమనార్హం.