అసెంబ్లీకి వ‌ద్దు.. జీహెచ్ఎంసీకి ముద్దు


ఈవీఎంల‌పై టీఆర్ఎస్ తీరు దేనికి సంకేతం..?

ఈవీఎంల ప‌నితీరుపై మాకు అనేక అనుమానాలున్నాయి.. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఈవీఎంలు వ‌ద్దు.. బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక‌లు జ‌ర‌పాలి.. 2018 ఆఖ‌ర్లో జ‌రిగిన తెలంగాణ‌ శాస‌న‌స‌భ ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, వామ‌ప‌క్ష పార్టీలు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి చేసిన విజ్ఞ‌ప్తి ఇది. కాని దీనిని అధికార‌ప‌క్షం టీఆర్ఎస్ తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఈవీఎంలు ఉండాల్సిందేనంటూ ప‌ట్టుప‌ట్టింది. బీజేపీ సైతం ఈవీఎంల వైపే మొగ్గుచూపింది. అటు కేంద్ర‌ప్ర‌భుత్వం, కేంద్ర‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సైతం ఈవీఎం ఎన్నిక‌లే నిర్వ‌హించాయి. అనంత‌రం సాధార‌ణ ఎన్నిక‌లు సైతం ఈవీఎంల ద్వారానే జ‌రిగాయి. ఎన్నిక‌లు ముగిశాయి. రాష్ట్రంలో మ‌ళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రాగా, కేంద్రంలోనూ గ‌త బీజేపీ ప్ర‌భుత్వ‌మే మ‌ళ్లీ అధికారం చేజిక్కించుకుంది. ఆశ్చ‌ర్య‌క‌రంగా రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అంత‌కుముందు ఎన్నిక‌ల్లో సాధించిన స్థానాల‌కంటే ఎక్కు‌వగా గెలుచుకోవ‌డం విశేషం. త‌మ ఓట‌మికి ఈవీఎంలే కార‌ణ‌మ‌ని కాంగ్రెస్, ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. ఎన్నిక‌ల‌కు ముందే ఈవీఎంల ప‌నితీరుపై కాంగ్రెస్, మిత్ర‌ప‌క్షాలు సుప్రీంకోర్టును కూడా ఆశ్ర‌యించాయి. ఈవీఎంలోని అన్ని ఓట్ల‌తో వీవీ ప్యాట్ స్లిప్ల‌తో స‌రిచూసిన అనంత‌రం ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాల‌ని కోర‌గా.. దీనికి సుప్రీంకోర్టు అంగీక‌రించ‌లేదు. ఇలా జ‌రిగితే ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ల‌లో జాప్యం జ‌రుగుతుంద‌న్న ఎన్నిక‌ల సంఘం వాద‌న‌తో ఏకీభ‌వించిన సుప్రీంకోర్టు ఒక నియోజ‌క‌వ‌ర్గంలో 5 వీవీప్యాట్ స్లిప్లుల‌ను మాత్ర‌మే లెక్కించాల‌ని తీర్పు చెప్పింది. కాని ఫ‌లితాల అనంత‌రం అనేక‌చోట్ల వీవీప్యాట్ లెక్క‌లు, ఈవీఎంల ఓట్ల‌తో స‌రిపోల‌క‌పోవ‌డం ఈవీఎంల ప‌నితీరుపై అంత‌కుముందే ఉన్న అనుమానాలను మ‌రింతగా పెంచాయి.

ఇప్పుడు బ్యాలెట్ ప‌త్రాలే కావాల‌ట‌..

గ‌త అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను స‌మ‌ర్ధించిన టీఆర్ఎస్ ఇప్పుడు జ‌రుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మాత్రం బ్యాలెట్ ప‌త్రాలనే వినియోగించాల‌ని చెప్ప‌డం వెన‌క ఉద్దేశం ఏమిటి..? టీఆర్ఎస్ పార్టీని ప్ర‌తి విష‌యంలో విమ‌ర్శిస్తున్న బీజేపీ సైతం ఈ విష‌యంలో ఎందుకు మౌనంగా ఉండిపోయింది..? అప్ప‌డు రెండు పార్టీలు మ‌ద్ద‌తిచ్చి, ఇప్ప‌డు ఈ రెండు పార్టీలే బ్యాలెట్ వైపు మొగ్గు చూప‌డం వెన‌క ఆంత‌ర్యం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ప్ర‌తిప‌క్షాలు అరోపిస్తున్న‌ట్టుగా రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావ‌డంలో నిజంగా ఈవీఎంలే కార‌ణ‌మ‌య్యాయా..? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య‌లోనే ఉన్నందున ఈ రెండు పార్టీలు ఈవీఎంల‌ను పూర్తిగా ప‌క్క‌న‌బెట్ట‌డం వెన‌క అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.