క‌రోనా వ్యాక్సిన్ కోసం మ‌రో 5 నెల‌లు ఆగాల్సిందే!

భార‌త్‌లో మొద‌ట వ‌చ్చేది కొవాగ్జినేనా?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రాణాల‌ను హ‌రించి… ఎన్నో దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను అత‌లాకుత‌లం చేసిన క‌రోనా వైర‌స్‌కు మందు క‌నుగొనే కృషిలో ఏయే దేశాలు ముందున్నాయి? జ‌నాభా ప‌రంగా రెండో పెద్ద దేశ‌మైన భార‌త్‌లో ఏ వ్యాక్సిన్ ముందు రానుంది? ఈ ప్రశ్న‌ల‌కు స‌మాధానాలు ఇంకా అస్ప‌ష్టంగానే ఉన్నాయి. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌న్నీ దాదాపు పూర్తిగా స‌డ‌లించిన నేప‌థ్యంలో సెకండ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వెలువడుతున్నాయి. జ‌నం చేసేదిలేక బిక్కుబిక్కుమంటూనే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో మ‌న దేశ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చేదెప్పుడు?

ఆక్స‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ రూపొందిస్తున్న ఆస్ట్రాజెనెకా టీకా రావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని స‌మాచారం. అమెరికాలోని అతి పెద్ద డ్ర‌గ్ కంపెనీ ఫైజ‌ర్ ప్ర‌స్తుతం 45 మంది వాలంటీర్ల‌తో తుది ద‌శ ట్ర‌య‌ల్ నిర్వ‌హిస్తోంది. న‌వంబ‌రు నెలాఖ‌రు నాటికి అమెరికా ప్ర‌భుత్వ అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసే అవ‌కాశం ఉంద‌ని, సంవ‌త్స‌రాంతానికి అమెరికా ప్ర‌జ‌ల‌కు త‌మ వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌చ్చ‌ని కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకాలు కూడా కొంచెం ఇంచుమించుగా అదే స‌మ‌యానికి ఆయా దేశాల‌కు ల‌భ్య‌మయ్యే అవ‌కాశం ఉంది.

ఈ ప‌రిస్థితుల్లో భార‌త్ త‌న సొంత ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది. హైద‌రాబాద్ కేంద్రంగా టీకాలు ఉత్ప‌త్తి చేస్తున్న భారత్ బ‌యోటెక్ కొవాగ్జిన్ పేరుతో టీకా ప్ర‌యోగాలు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. భార‌త వైద్య ప‌రిశోధ‌న‌మండ‌లి (ఐసీఎంఆర్‌)తో క‌లిసి భార‌త్ బ‌యో ప్ర‌య‌త్నాలు ఫిబ్ర‌వ‌రిలోగా కొలిక్కి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త ర‌జ‌నీకాంత్ తెలిపారు. కొవాగ్జిన్ ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగానే ఉన్నాయ‌ని, ఫిబ్ర‌వ‌రి, మార్చి నాటికి ఆ టీకా సిద్ధ‌మ‌వుతుంద‌ని ఐసీఎంఆర్ అంచ‌నా వేస్తోంది. ఈ లెక్క‌న ఇండియాలో అందుబాటులోకి వ‌చ్చే మొట్ట‌మొద‌టి వ్యాక్సిన్ కొవాగ్జినే కావ‌చ్చ‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published.