‘చిన్నమ్మ’ వచ్చేస్తున్నారహో..

రూ.10.10 కోట్లు జరిమానా చెల్లించిన శశికళ

వేడెక్కుతున్న తమిళనాడు రాజకీయాలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం అక్కడి రాజకీయాలను వేడెక్కించిన ఆమె నెచ్చెలి శశికళ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూర్ పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెకు వచ్చే ఏడాది జనవరిలో శిక్షాకాలం పూర్తికానుంది. నాలుగేళ్ల జైలుశిక్ష పాటు రూ.10.10 కోట్లు జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఏడాది కారాగార శిక్ష అనుభవించాలని అప్పట్లో న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జె.కున్హా తీర్పునిచ్చారు.  దానికి అనుగుణంగా జరిమానాను యాక్సిస్ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంకుల డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా బెంగళూర్ సిటీ సివిల్ కోర్టు కార్యాలయంలో అందించామని శశికళ తరఫు న్యాయవాది రాజా సెంధూర్ పాండియన్ తెలిపారు.  ఇప్పటికే ‘చిన్నమ్మ’ (జయలలితను ‘అమ్మ’ అని, శశికళను ‘చిన్నమ్మ’ అని కార్యకర్తలు పిలిచేవారు) విడుదలపై పలు ప్రచారాలు ఉన్నాయి. ఆమె విడుదల తర్వాత అన్నాడీఎంకే కీలక నేతలు, కార్యకర్తలు ఆమెను ఆశ్రయించి పార్టీ పగ్గాలు అందుకోమని కోరచ్చనే ప్రచారం కూడా ఉంది. దీనిని అధికార పార్టీలో కొందరు కొట్టిపారేస్తున్నారు. 2021లో తమిళనాడు శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేరును ఇప్పటికే పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  పార్టీలోకి ఆమెకు స్థానం లేదని తెగేసి చెబుతుండగా మరికొందరు నేతలు ‘చిన్నమ్మ’ విషయంలో మౌనం వహిస్తున్నారు. అన్నాడీఎంకే తిరస్కరిస్తే తన అక్క కుమారుడు టీటీవీ దినకరన్ స్థాపించిన ఏఎంఎంకే పార్టీ పగ్గాలు చేపడతారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అదే జరిగితే అన్నాడీఎంకేలోని ఆమె అనుచర నేతలతో అధికార పార్టీలో చీలికలు రావచ్చని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శశికళ విడుదలైతే అన్నాడీఎంకేలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని భాజపా ఉపాధ్యక్షుడు నాయినార్ నాగేంద్రన్ సైతం వ్యాఖ్యానించారు.  అయితే శశికళ విడుదలతో అన్నాడీఎంకే పార్టీలో, పాలనలో ఎలాంటి మార్పులు జరగవని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కోయంబత్తూర్ లో విలేఖర్లతో వెల్లడించడం గమనార్హం. ప్రస్తుత రాజకీయ పరిణామాలను తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. జైలు వర్గాల సమాచారం మేరకు తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందే శశికళ విడుదల తేది ఉండటంతో రాజకీయంగా పావులు కదిపేందుకు ప్రయత్నిస్తుంది. శశికళ పరిణామాలతో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడితే దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది.

‘చిన్నమ్మ’ శపథం ఏమిటో ఆమెకే తెలియాలి

జైలుకెళ్లే సమయంలో చెన్నై మెరినా తీరంలోని జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి శశికళ మూడుసార్లు సమాధిపై చరుస్తూ ఏదో ఉచ్చరించినట్లు వార్తా చానెళ్లలో స్పష్టంగా కనిపించింది. జైలుకెళ్లే సమయంలో ఆమె ఏవే మూడు శపథాలు చేశారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం శశికళ విడుదలైతే ఆ మూడు శపథాలు ఏమిటనే విషయంపై చిదంబరం రహస్యం వీడుతోందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.