జీ 7 చర్చల్లో ఇంటర్నెట్ తీసేశారెందుకో?

చైనా గూఢచర్యం చేస్తుందన్న భయంతోనేనా?

యూకేలో జరుగుతున్న జీ7 దేశాల సమావేశం చైనా ఏ స్థాయిలో పశ్చిమ దేశాలను భయపెట్టిందో చెబుతోంది. ఈ సమావేశంలో నేతలు ఓపెన్‌గా మాట్లాడుకోవడానికి కూడా భయపడ్డారు. ముఖ్యంగా జీ7 భేటీలో యుకే, కెనడా అమెరికా దేశాలు చైనాపై ఆంక్షలను బలపర్చగా.. జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి దేశాలకు ఈ చర్య ఇష్టంలేదు. దీంతో జీ7లో విభేదాలు బయటపడితే చైనా మరింత రెచ్చిపోతుందని అమెరికా భయపడింది. మిత్రులకు సర్ది చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించింది.

ఈ అంశాలన్నీ బయటకు రాకుండా చేసేందుకు ఆ ప్రాంతంలోని ఇంటర్నెట్‌ను ఆపేశారు. కీలక వ్యక్తులను తప్పితే మిగిలిన వారిని బయటకు పంపించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని అమెరికా రహస్యంగా మిత్రదేశాలతో చర్చించింది. మొత్తం మీద ఏదో ఆసక్తికర చర్చ జరిగింది అని అమెరికా ఛానెల్‌ సీఎన్ఎన్‌ పేర్కొంది. వాస్తవానికి ఇక్కడ చైనా గూఢచర్య భయంతోనే సమావేశం జరుగుతున్న భవనం, చుట్టుపక్కల ఇంటర్నెట్‌ను తొలగించారు. గతంలో వివిధ దౌత్య కార్యాలయాల్లో ఇంటర్నెట్‌ సాయంతో చైనా గూఢచర్యం చేసిన ఘటనలు ఉన్నాయి.

అగ్రరాజ్యాల నిఘా సంస్థలన్నీ సాఫ్ట్‌వేర్లు, హార్డ్‌వేర్ల తయారీదారులను నయానోభయానో ఒప్పించి తమ కార్యక్రమాల్లో పావులుగా మారుస్తున్నాయి. ఈ విషయం ప్రజావేగు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ బట్టబయలు చేసిన పత్రాల్లో స్పష్టంగా ఉంది. హార్డ్‌వేర్‌ విషయంలో డిజైనింగ్‌, తయారీ, నిల్వ, పంపిణీ… ఏదో ఒక దశను నిఘా సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకొంటాయి. అంతదేనికి గతంలో వివిధ దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల్లోని కంప్యూటర్ల కెమేరాలు,మైకులు ఆటోమేటిక్‌గా ఆన్‌ అయిపోయేవి. అప్పట్లో ఈ ఘటనపై దర్యాప్తు చేసి సైబర్‌ దాడిగా గుర్తించారు.

ఈ సారి జీ7 సమావేశల్లోనే అమెరికా నేతృత్వంలో చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)కు పోటీగా కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. దీనిని ది బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ వరల్డ్‌ ఇనీషియేటివ్‌గా పేర్కొన్నారు. ఇది పేదదేశాలకు మౌలిక సదుపాయల కల్పనలో సాయం చేయనుంది. ఇప్పటికే చైనా నేతృత్వంలో చేపట్టిన బీఆర్‌ఐలో దాదాపు 100కు పైగా దేశాలు భాగస్వాములు అయ్యాయి. అంతేకాదు ఆ దేశాలు పూర్తిగా చైనా గుప్పిట్లోకి వెళితే ఐరాస కీలక ఓటింగులో కూడా అమెరికాకు ఇక పరాభవం తప్పదు. అందుకే అగ్రరాజ్యం, దాని మిత్రులు చిన్న దేశాల్లో పరపతి పెంచుకొనేందుకు కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించారు. సోవియట్‌ యూనియన్‌ ఆర్థిక శక్తికాదు.. అందుకే పతనమైంది.. కానీ, చైనా ఆర్థిక,సైనిక శక్తి ఉన్న సూపర్‌ పవర్‌. అమెరికా ఒప్పుకొన్నా.. ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం.

Leave a Reply

Your email address will not be published.