జో బైడెన్ మూలాలు ఇండియావేనా?

బీరకాయ పీచు చుట్టరికం అంటే ఇదేనేమో… అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కు మన దేశంలో చుట్టాలున్నారట. బైడెన్ అనే ఇంటిపేరు (సర్ నేమ్)తో కొన్ని కుటుంబాలు మహారాష్ర్టలో నివసిస్తున్న విషయం తాజాగా తెరపైకి వచ్చింది. తన దూరపు బంధువులు ఇండియాలో ఉన్నారని బైడెన్ 2013, 2015లలో స్వయంగా వెల్లడించారు. అదుగో ఆ బంధువులే తాము నాగపూర్లో 1873 నుంచీ నివసిస్తున్నామని తాజాగా ప్రకటించారు.

అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో 2013లో ముంబై స్టాక్ ఎక్స్చేంజిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ… ముంబైలో తనకు చుట్టాలున్నారని చెప్పారు. 2015లో వాషింగ్టన్లోనూ ఆయన ఇదే విషయం చెప్పారు. తనకు 29 ఏళ్ల వయసున్నప్పుడు 1972లో అమెరికా సెనేటర్ గా ఎన్నికైన సందర్భంగా… తన బంధువులమని గుర్తుచేస్తూ ముంబైలోని బైడెన్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి లేఖ రాశారని జో తెలిపారు. దాని ప్రకారం తన ముత్తాత..ముత్తాత…ముత్తాత…. జార్జి బైడెన్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కెప్టెన్ గా పనిచేసినట్లు తెలిసిందని బైడెన్ అప్పట్లో చెప్పారు. జార్జి రిటైరైన తర్వాత భారత మహిళను పెళ్లి చేసుకుని ఇండియాలోనే స్థిరపడినట్లు తెలుస్తోందని ఆయన గుర్తు చేసుకున్నారు.

నాగ్ పూర్ కు చెందిన బైడెన్ వంశీయులు వీరే

జో బైడెన్ కు లేఖ రాసిన వ్యక్తి పేరు లెస్లీ బైడెన్. ఆయన మనవలు ప్రస్తుతం నాగ్ పూర్లో నివసిస్తున్నారు. లెస్లీ మనవరాలు సోనియా బైడెన్ ఫ్రాన్సిస్ నాగ్ పూర్లో సైకాలజిస్టుగా పనిచేస్తున్నారు. 1981లో అప్పటి యూఎస్ సెనేటర్ గా ఉన్న జో బైడెన్ గురించి ప్రచురితమైన ఓ కథనం చదివిన లెస్లీ తమ వంశవృక్షాన్ని గుర్తుచేస్తూ ఆ ఏడాది ఏప్రిల్ 15న జో కు లేఖ రాశారని సోనియా తెలిపారు. తమ వంశ పూర్వీకుడైన జాన్ బైడెన్, అన్నీ బ్యూ మాంట్ ను 1781లో వివాహం చేసుకున్నారని లెస్లీ ఆ లేఖలో ప్రస్తావించారు. ఇండియాలో బైడెన్ వంశ పరిణామాన్ని అందులో సోదాహరణంగా వివరించారు. దానికి జో బైడెన్ కృతజ్ఞతలు తెలుపుతూ మే 30వ తేదీన ప్రత్యుత్తరం రాశారని, ఈ సంబంధాలు కొనసాగించుకోవాలని పరస్పరం అనుకున్నారని ఆమె వివరించారు. కానీ తమ తాత 1983లో మృతి చెందడంతో బైడెన్ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలకు అవకాశం లేకుండా పోయిందని లెస్లీ మరో మనవరాలు, నాగ్ పూర్లోనే నివసిస్తున్న రౌవెనా చెప్పారు. జో బైడెన్ నుంచి లెస్లీకి వచ్చిన ఉత్తరాలను వారు సాక్ష్యంగా చూపించారు. తమ బైడెన్ వంశీకులు ముంబై, నాగ్ పూర్ తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో నివసిస్తున్నారని సోనియా చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ కూడా భారత సంతతికి చెందినవారన్న సంగతి తెలిసిందే. సో, అగ్రరాజ్యమైన అమెరికాలోని రెండు ఉన్నత స్థానాలనూ ఇండియన్ మూలాలున్న వారే అధిష్ఠించారని సంతోషిద్దాం.

Leave a Reply

Your email address will not be published.