నీవు నేర్పిన విద్యయే….

పీకేపై ఆర్కే మార్కు అక్కసు

తాను చేస్తే సంసారం… ఇతరులు చేస్తే వ్యభిచారం… కొందరి తీరు ఇలానే ఉంటుంది. ముఖ్యంగా తెలుగునాట ఎల్లో జర్నలిజం పోకడలివే. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను శాసించే స్థాయికి చేరిన ఈ కుపాత్రికేయం చేతిలో అధికారం లేనప్పుడు మాత్రం చిలకపలుకులు పలుకుతుంటుంది. అలాంటి వాక్యరాజాలే ఆదివారం (జూన్ 13, 2021) నాటి ఆంధ్రజ్యోతిలో దాని అధిపతి రాధాకృష్ణ కలం నుంచి జాలువారాయి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నాటి ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఆయన టార్గెట్ చేశారు.

ప్రశాంత్ కిషోర్ వల్ల రాజకీయ సిద్ధాంతాలు పతనమయ్యాయా? సిద్ధాంతాల స్థానే ఈవెంట్ మేనేజర్ల వల్లనే ఎన్నికల్లో పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉన్నాయా?
రాధాకృష్ణ కొత్త పలుకులివి. సరే ఈవెంట్ మేనేజ్మెంట్ ఏమిటో.. సిద్ధాంతాల కథలేమిటో కాసేపు పక్కన పెడదాం.

మరి 1983 నుంచి తెలుగు రాజకీయాలలో‌ ఏం జరుగుతూ వస్తోంది? టిడిపిని అధికారంలో కూర్చోబెట్టడానికి ఈవెంట్ మేనేజర్ల స్థాయిలో తెలుగు మీడియాలోని ఒక వర్గం చేసింది ఏమిటి? 1996లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను గద్దె దించడానికి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడానికి నాటి మీడియా శక్తులు ఆడిన నాటకాలేమిటి? కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టిన వారిని తెర వెనుక కుట్రలు, కుతంత్రాలతో దెబ్బ తీసిందెవరు?

వీటికి కూడా రాధాకృష్ణ జవాబులు చెబితే బాగుండేదేమో!

తెలుగునాట ప్రధాన మీడియా ఏనాడో‌‌ దారి తప్పేసింది. లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి‌ చెవుల్లో పువ్వులు పెడుతోందని జనానికి పూర్తిగా అర్థమైపోయింది. అందుకే వాటి పప్పులు ఉడకడం లేదు.
ఒక వ్యక్తి కి లేదా అతని కుటుంబానికే అధికారం శాశ్వతంగా దక్కాలన్న వాటి కుతంత్రాలు ఇక చెల్లకపోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ కుటుంబ‌ రాజకీయాలను ఈసడించిన ‘ఈనాడు’ ఇప్పుడు చంద్రబాబు విషయంలో తన రూటు మార్చేసుకుంది.
అస్మదీయులకు ఒక రకంగా, తస్మదీయులకు మరొక రకంగా ప్రయారిటీలు ఇవ్వడాన్ని ఏమనాలి?
మీకు నొప్పి కలిగితే అది ప్రజలందరి బాధగా చిత్రీకరించి.. మీకు ప్రయోజనాలు కలిగినప్పుడు అబ్బో ఎంత అభివృద్ధోనంటూ కీర్తించిన సందర్భాలను జనం మరచిపొయే పరిస్థితి లేదు.
2019 ఎన్నికల్లో ఏం‌ జరిగిందో అందరికీ తెలుసు. జన్మభూమి కమిటీల బాగోతాలు, ఇసుక అక్రమాలు, ఏటిఎంలా మారిపోయిన పోలవరం ప్రాజెక్టు, విసిగెత్తించిన అమరావతి గ్రాఫిక్స్, అన్నిటికీ మించి వెగటు స్థాయిని దాటిపోయిన పచ్చ మీడియా కీర్తనలు… చెబుతూ పోతే చాలా ఉన్నాయ్. అంతేగాని ప్రశాంత్ కిషోర్ కే‌ గొప్పతనాన్ని అంటగడితే ఎలా?

Leave a Reply

Your email address will not be published.