బెంగాల్ లో భాజపా బెంగ తీరేనా?

కమలం కల… ఆ అయిదు రాష్ట్రాల్లో విజయం
వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికలు

బిహార్ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల్లో గణనీయ ఫలితాలు సాధించి అప్రతిహత ఘనత చాటిన బీజేపీ తదుపరి లక్ష్యం ఏమిటి? భారత్ మ్యాప్ లో కమలం అధికారానికి సూచికగా వివిధ రాష్ట్రాలను కాషాయరంగు అలముకుంటున్న వేళ… ఆ పార్టీకి కొరకరాని కొయ్యలుగా ఉన్న రాష్ట్రాలకు వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. 2021 ఆరంభంలోనే అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికలకు తెర లేవనుంది. అస్సాంలో ఇప్పటికే అధికారంలో ఉన్న భాజపా మరోసారి దాన్ని నిలబెట్టుకోగలనన్న నమ్మకంతో ఉంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చట్టం స్థానికేతరుల ప్రవేశాన్ని నిరోధించేదిగా భావిస్తున్న అస్సామీయులు తమకు మళ్లీ పట్టం కడతారని కమలనాథులు ఆశిస్తున్నారు. కేరళ, తమిళనాడులలో బలం పెంచుకోవడానికి భాజపా చేసే ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నది ప్రశ్నార్థకమే. హిందీ, ఉత్తరాది వ్యతిరేక భావాలుండే ఈ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ వెనకబాటు చారిత్రక సత్యం. సంక్లిష్టమైన ఈ ప్రాంతాల్లో పట్టు సాధించడం భాజపాకు ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. అన్నాడీఎంకేతో లోపాయకారీ అవగాహన కొనసాగిస్తున్న కమలం పార్టీకి దక్కేది పెద్దగా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంతో పాటు వ్యూహాత్మకంగా ఈ అయిదు రాష్ట్రాల్లోనూ బెంగాల్ పైనే భాజపా అధికంగా దృష్టి సారించే అవకాశం ఉంది.

కిందటి లోక్ సభ ఎన్నికల్లో మినహా బెంగాల్ నుంచి భాజపాకు దక్కింది తక్కువే. దశాబ్దాల పాటు వామపక్షాల ఏలుబడి… తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రెండూ భాజపాకు బద్ధ శత్రువులే. అందుకే తూర్పున పెద్ద రాష్ట్రమైన బెంగాల్ లో విజయం సాధించడం ద్వారా భాజపా దేశంలో తన భౌగోళిక ఆధిపత్యాన్ని మరింతగా చాటుకోవాలన్న కసితో ఉంది. అక్కడ పాగా వేస్తే తన సైద్ధాంతిక, రాజకీయ అజెండా అమలు చేయడం, రాజ్యసభ సీట్లు పెంచుకోవడం సాధ్యమని అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం సాధిస్తే 2024 సాధారణ ఎన్నికల నాటికి తమ ప్రధాన ప్రత్యర్థి, ప్రస్తుత అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను కట్టడి చేయవచ్చని భావిస్తోంది.

కానీ బెంగాల్ లో విజయం సాధించడం భాజపాకు అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే పేరుకు ప్రత్యర్థి ఒక్క పార్టీయే అయినా… భాజపాకు బద్ధ శత్రువులైన కాంగ్రెస్, వామపక్షాలు, మజ్లిస్ (ఎంఐఎం) పార్టీలు బరిలో గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత కారణంగా పడే ప్రతికూల ఓటింగ్ చీలిపోయి అటు తృణమూల్ కో, ఇటు భాజపాకో మేలు చేసే అవకాశం లేకపోలేదు. మమతపై ప్రజల్లో ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకునేలా భాజపా తాము ‘మార్పు’ తీసుకొస్తామంటూ గట్టి ప్రచారం చేసుకోగలిగితే ఆ పార్టీకి కొంత ప్రయోజనం దక్కవచ్చు. అలాగే మైనార్టీలను బుజ్జగించే ధోరణిని చూపి… ఓటర్లలో మతపరమైన చీలిక తెచ్చేందుకు కూడా భాజపా వ్యూహం రచించే అవకాశం ఉంది. చివరిగా… అటు మోడీ, ఇటు మమతలను మాత్రమే ఓటర్లు ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని నాయకత్వ పోటీ దృష్టితో ఎవరివైపు ఎక్కువగా మొగ్గుతారో కూడా వేచి చూడాలి. ఏది ఏమైనా… పెద్దది, కీలమైనది అయిన బెంగాల్… భాజపా బెంగను తీరుస్తుందా?

Leave a Reply

Your email address will not be published.