భారత్ పైకి పాక్ ఆడ గూఢచారులు

కీలక ప్రభుత్వ కార్యాలయంలో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ట్రింగ్‌.. ట్రింగ్‌ అని మోగుతుంది.. దాన్ని లిఫ్ట్‌ చేస్తే.. అటు వైపు నుంచి తీయని ఆడ గొంతు పలకరిస్తుంది. పై అధికారి ఆఫీస్‌ నుంచి కాల్‌ చేస్తున్నా అని చెబుతుంది. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ వివరాలు తెలుసుకొంటుంది.. అనుమానిస్తే ఫోన్‌ కట్‌ చేస్తుంది.

ఎవరామె? ఏంటా మిస్టరీ?

భారత సైన్యం నుంచి కీలక సమాచారం కొల్లగొట్టడానికి పాక్‌ ఆడ గూఢచారులను రంగంలోకి దించింది. ఉన్నతస్థాయి విద్యాలయాల్లో చదువుకొని పలు భాషలు మాట్లడగలిగే యువతులను పాకిస్థాన్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ విభాగం నియమించుకొంటోంది. భారత సైన్యం నుంచి సమాచారం ఎలా సేకరించాలో వారికి నేర్పిస్తోంది. ఇలా పాక్ నిఘా విభాగంలో రాటుదేలిన ఓ యువతి సమాచారాన్ని భారత్‌కు చెందిన ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక ‘ది సండే గార్డియన్‌ ’ చేజిక్కించుకొంది. దీంతో అసలు విషయం బయటపడింది.

పాకిస్థాన్‌లోని ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఈ 28 ఏళ్ల యువతి.. భారత్‌ నుంచి సమాచారం దొంగిలించడంలో సిద్ధహస్తురాలు. ఈమె సైనిక అధికారులు, జవాన్లను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తోంది. పాక్‌ సైనిక ప్రధాన కార్యాలయం ఉండే రావల్పిండిలో మిలిటరీ ఇంటెలిజెన్స్‌ విభాగంలోని 414 ఐఎన్‌టీ డెస్క్‌లో పనిచేస్తోంది. ఈ విభాగానికి మేజర్‌ ఒమర్‌ జెబ్‌ ఖాన్‌ అధిపతిగా ఉన్నాడు. అతడు గతంలో అఫ్గానిస్థాన్లో సమాచారం సేకరించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మాయలేడీ తరచూ చైనాను కూడా సందర్శిస్తుంటుంది.. అక్కడ సమాచారం పంచుకోవడంతోపాటు.. టెక్నిక్స్‌ నేర్చుకొంటుంది. భారతీయ ఆర్మీ వెబ్‌సైట్‌లోని ల్యాండ్‌లైన్‌ నెంబర్లను సేకరించి వాటికి ఆ యువతి ఫోన్‌ చేస్తుంది. ఇటీవల కాలంలో ఆ యువతి కార్యకలాపాలను సండే గార్డియన్‌ పత్రిక బయటపెట్టింది. కొన్నాళ్ల కిందట సరిహద్దుల్లోని ఓ సైనిక కార్యాలయానికి ఫోన్‌ చేసిన విషయాన్ని వివరించింది. ఆ కార్యాలయానికి ఫోన్‌ చేసి దళాల సమాచారం అడిగింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో స్పష్టమైన హిందీలో మాట్లాడింది. రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యాలయం నుంచి తాను ఫోన్‌ చేసినట్లు తెలిపింది. అవసరమైన సమాచారం అందుబాటులో లేకపోతే మరికొద్ది సేపు ఆగి ఫోన్‌ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత అన్నట్లే ఫోన్‌ చేసింది.

లేహ్‌లోని డిస్ట్రిక్ట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌కు ఫోన్‌ చేసి.. తనను తాను దిల్లీలో ఓ జర్నలిజం విద్యార్థినిగా పరిచయం చేసుకొంది. లేహ్‌లో ప్రస్తుత పరిస్థిని వాకబు చేసింది.

మరో సైనిక అధికారికి కూడా ఇలానే ఫోన్‌ చేసింది. ఆ సమయంలో అధికారి అక్కడ లేకపోవడంతో జవాన్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేశారు. ఆ అధికారి ఎక్కడకు వెళ్లారని.. ఆ యూనిట్‌ ప్లాన్లను.. ప్రస్తుతం యూనిట్‌ ఏ సెక్టార్‌లో ఉంది వంటి వివరాలను అడిగి తెలుసుకొంది.

ఇలా భారత్‌ సైన్యాన్ని బురిడీ కొట్టించడానికి పాక్‌ చాలా ఎత్తులు వేస్తోంది. కాల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయో వెంటనే గుర్తించకుండా ఉండేలా ల్యాండ్‌లైన్‌ నెంబర్లను వాడుతోంది. దీంతోపాటు కీలక కార్యాలయాల్లో పనిచేసేవారిని బుట్టలో వేసుకునేందుకు వలపు వల విసిరే బృందాలను కూడా పాక్‌ సిద్ధం చేసుకొంది. ఇలాంటి గూఢచర్య గుట్టునే ఏటీఎస్ బృందం ఛేదించింది. కీలక సమాచారాన్ని కాపాడింది.

Leave a Reply

Your email address will not be published.