రోడ్డుపై చెత్త పారేసినందుకు 80 కి.మీ. వెన‌క్కి రప్పించారు

విదేశాల్లో చెత్త రోడ్ల‌పై వేస్తే తీవ్ర నేరంగా ప‌రిగ‌ణించి జ‌రిమానా వేస్తారు. నేర స్థాయిని బ‌ట్టి ఇత‌ర శిక్ష‌లూ ఉంటాయి. మ‌నోళ్లు ఆయా దేశాల్లో తిరిగొచ్చిన‌ప్పుడు… అబ్బో అక్క‌డెంత క్ర‌మ‌శిక్ష‌ణో… అనుకుంటూ ఆశ్చ‌ర్య‌పోతారు. ఇండియాకు తిరిగొచ్చాక ఇక్క‌డ ష‌రా మామూలే. ఎంత చ‌దువుకున్న వారైనా వ్య‌ర్థ ప‌దార్థాల‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పారేయ‌డ‌మే. స్వ‌చ్ఛ భార‌త్ వంటి కార్య‌క్ర‌మాల ద్వారా ఎంత ప్ర‌చారం చేసినా మ‌న స‌మాజంలో చెప్పుకోద‌గిన మార్పు రాలేద‌నే చెప్పాలి. ఇత‌ర దేశాల్లో మాదిరే ఇక్క‌డ కూడా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తే కొంత ఫ‌లితం ఉంటుందేమో… తిరువ‌నంత‌పురం వంటి కొన్ని న‌గ‌రాల్లో కేర‌ళ ప్ర‌భుత్వం కొంత ఇలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. తాజా ఉదంతం క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. అక్క‌డ కొడ‌గు (కూర్గ్‌) ప్రాంతం కాఫీ తోట‌ల‌కు, జ‌ల‌పాతాల‌కు ప్ర‌సిద్ధి. చ‌ల్ల‌ని , ఆహ్లాద‌క‌ర‌మైన ఆ ప్ర‌దేశానికి ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువే. ఈ నేప‌థ్యంలోనే ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే చ‌ర్య‌లూ ష‌రా మామూలే. వీటిని నివారించడానికే అక్క‌డ కొన్ని సంఘాలు ఏర్ప‌డ్డాయి. అలాంటిదే కొడ‌గు టూరిజం అసోసియేష‌న్‌.

కొడ‌గు ప‌ర్యాట‌క ప్రాంతాల ప‌రిశుభ్ర‌త బాధ్య‌త‌ను ఆయా గ్రామాల పంచాయ‌తీలు, స్థానిక స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ప‌ర్య‌వేక్షిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అసోసియేష‌న్ అధ్యక్షుడు మ‌డితెర తిమ్మ‌య్య త‌న కారులో వ‌స్తుండ‌గా, అడ‌విలో రోడ్డు ప‌క్క‌న చెత్తా చెదారం పారేసి ఉండ‌డాన్ని చూశారు. తామెంతో క‌ష్ట‌ప‌డి స్వ‌చ్ఛంగా ఉంచుతున్న ప్రాంతాల‌ను కొంద‌రు ఇలా బాధ్య‌త రాహిత్యంగా క‌లుషితం చేయ‌డమేమిట‌ని ఆయ‌న అసంతృప్తి చెందారు. వెంట‌నే అక్క‌డ పారేసి ఉన్న పిజ్జా బాక్సులు, ఇత‌ర కాగితాల‌ను వెతికితే ఓ ఫోన్ నెంబ‌రు దొరికింది. వెంట‌నే దానికి ఫోన్ చేస్తే… ఆ కాల్ ఆన్స‌ర్ చేసిన వ్య‌క్తి, మ‌రో వ్య‌క్తి చెత్త పారేసిన వార‌ని నిర్ధారించుకున్నారు. వెంట‌నే వెన‌క్కి వ‌చ్చి… మీరు పార‌వేసిన చెత్త‌ను మీరే తీయాల‌ని ఆ ప‌ర్యాట‌కుల‌ను కోరారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియా ద్వారా వేగంగా ప్ర‌చారం కావ‌డం, మ‌రికొంద‌రు స్థానికులు కూడా వారికి ఫోన్‌లు చేయ‌డంతో ఆ ఇద్ద‌రు ప‌ర్యాట‌కులు సిగ్గు ప‌డ్డారు. 80 కి.మీ. దూరం ముందుకు వెళ్లిపోయిన వారు ఎట్ట‌కేల‌కు వెన‌క్కి వ‌చ్చి మ‌రీ తాము ప‌డేసిన వ్యర్థాల‌ను తామే తొల‌గించాల్సి వ‌చ్చింది. ప‌ర్యావ‌ర‌ణ స్పృహ క‌లిగించేందుకే తాము ఈ చ‌ర్య తీసుకున్నామ‌ని అసోసియేష‌న్ ప్ర‌తినిధులు తెలిపారు. చూశారా… శిక్ష అని అనిపించ‌కుండానే వారికి ఎంత ప‌నిష్మెంట్ ఇచ్చారో!

Leave a Reply

Your email address will not be published.