25 ఏళ్లుగా ఊరిస్తూ.. ఉసూరుమనిపించాడు
ఇక భవిష్యత్తులోనూ వచ్చే ఛాన్సే లేదు
సినిమాల్లో ఆయనో సూపర్ స్టార్.. ఆయన పేరే ఒక బ్రాండ్.. ఆయన పేరును ఉపయోగించిన సినిమాలు, లుంగి డ్యాన్సు లాంటి పాటలు ఘన విజయాలు సాధించాయంటే ఆయన బ్రాండ్ విలువ ఏమిటో ఊహించుకోవచ్చు.. ప్రజలు తనను ఇంతగా ఆదరించినందున రాజకీయాల్లోకి వచ్చి (ఎంజిఆర్, జయలలిత తరహాలో) సత్తా చాటాలని, రాజకీయాల్లోనూ సూపర్ స్టార్ కావాలని ఆశపడుతున్నారు. 25 సంవత్సరాలుగా ఆశ పడుతూనే ఉన్నారు.. ఆయన ఆశ ఇక తీరే పరిస్థితులు కనిపించడం లేదు.
మొదటిసారి జయలలితకు వ్యతిరేకంగా..
తమిళనాడు సినీ పరిశ్రమలో తలైవా (నాయకుడు)గా పేరుగాంచిన రజనీకాంత్ రాజకీయాలపైనా ఆసక్తి చూపించడం మొట్టమొదటిసారిగా 1995లో ప్రారంభమైంది. అప్పడు తమిళనాడులో అధికారంలో అన్నాడీఎంకే ఉండగా.. ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు. అనేక అవినీతి అరోపణల్లో మునిగిపోయిన జయలలిత ప్రభుత్వంపై ఆయన బాహాటంగానే విమర్శించారు. జయలలిత పార్టీని గెలిపిస్తే తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు.. అన్న రజనీకాంత్ డీఎంకే, టీఎంసీ కూటమికి తన మద్దతు ప్రకటించారు. అంతవరకు సినిమాలకే పరిమితమైన తలైవా జయలలిత ప్రభుత్వాన్ని అలా బాహాటంగా విమర్శించడంపై ప్రజలు సైతం హర్షించారు. ఈ ప్రకటనతో రజనీకాంత్ రాజకీయాల పట్ల తన ఆసక్తినీ పరోక్షంగా వెల్లడించాడు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత ప్రభుత్వం ఘోర పరాజయం చవిచూడటం వెనక తలైవ కూడా ఓ కారణమయ్యాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలన్న ఒత్తిడి ఆయనపై అప్పటి నుంచే ప్రారంభమైంది. ప్రతి ఎన్నికల్లో రజనీ ప్రకటన కోసం అభిమానులే కాదు రాష్ట్ర ప్రజలు సైతం ఆశగా ఎదురుచూసేవారు. మరోవైపు ఎన్నికల ముందు ఆయన మద్దతు కోసం పార్టీలు పాకులాడేవి.
2004 ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. వ్యక్తిగతంగా తాను బీజేపీకి ఓటు వేస్తానని ప్రకటించినా.. తన మద్దతు మాత్రం ఎవ్వరికీ ప్రకటించలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది.

ఊరిస్తూనే ఉన్నాడు..
1995 నుంచి రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై ఊరిస్తూనే ఉన్నారు. తమిళనాడులో జరిగిన 2001, 2006, 2011 , 2016 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. అభిమానుల ఆశాలపై ఆయన నీళ్లు చల్లుతూ వచ్చారు. 2016లో జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత్వం ఏర్పడింది. మరోవైపు డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి సైతం కన్నుమూశారు. వీరిద్దరూ లేకుండా జరిగే తొలి ఎన్నికలు 2021లో జరగనున్నాయి. ఇదే మంచి తరుణమని భావించిన రజనీకాంత్ డిసెంబరు-31న రాజకీయ పార్టీ ప్రారంభం అని ప్రకటించారు. ఇటీవలే షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయాల్లో రావట్లేదని మంగళవారం ఆయన ప్రకటన అభిమానులను మళ్లీ నిరాశ కలిగించింది. సమయం వచ్చినప్పడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తా అంటూ.. చెప్పుతూ వచ్చిన ఆయన.. తాజా ప్రకటనలోనూ దాదాపు అలాంటి ప్రకటనే చేశారు. ఎప్పుడో ఒకప్పుడు వస్తా.. ఇప్పుడు మాత్రం కాదు.. అంటూ అభిమానుల ఆశలు సజీవంగా ఉండాలన్న లక్ష్యంతో ముగించారు. ఇప్పటికే 70వ ఏటా ఉన్న తలైవా ఇంకా ఎప్పుడస్తారు..? ఇప్పుడే ఆరోగ్యం సహరించలేనప్పుడు భవిష్యత్తులో ఇంకేం సహకరిస్తుంది..? అన్న ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయి. ఇక రాజకీయాల్లోకి రాను.. అని కరాఖండిగా చెప్పి.. అభిమానులను నిరాశ కలిగించవద్దనే ఇలాంటి ప్రకటన ఇచ్చారని తెలిసింది. వీటన్నిటినీ పరిశీలిస్తే రాజకీయాల్లో రజనీ రంగప్రవేశం ఉండే అవకాశాలు లేనట్టే.!