ఒక్క ట్వీట్ తో నెరవేరిన నిరుపేద విద్యార్థిని కల

నటుడు శివ కార్తికేయన్ సాయం ఫలించిన వేళ…

తమిళ సినీ నటుడు శివ కార్తికేయన్

చిన్నపాటి సాయం కూడా నిస్సహాయులకు ఎంత మహోపకారం చేస్తుందో వివరించే ఘటన ఇది. ఏడాది కిందట ఒకరు చేసిన ఒకే ఒక్క ట్వీట్ తో ఇప్పుడు ఓ విద్యార్థినికి వైద్యవిద్య కల నెరవేరింది. తమిళనాడులోని తంజావూర్ జిల్లా పేరావూరణికి చెందిన సహానా అనే విద్యార్థిని గత ఏడాది ప్లస్ 2 (ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం) పబ్లిక్ పరీక్షల్లో 600మార్కులకుగాను 524 మార్కులు పొందింది.  గజ తుపాను దాటికి దెబ్బతిన్న పూరిగుడిసెలో కనీసం విద్యుత్తు దీపం కూడా లేకుండా చదివిన ఆ బాలిక ఈ మార్కులు పొందినట్టు సెల్వం అనే ఉపాధ్యాయుడు అప్పట్లో ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఇంట్లో ఉన్న ఫొటోనూ ఉంచారు. దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.  ఆమె నీట్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన సాయం అందించడానికి నటుడు శివకార్తికేయన్ ముందుకు వచ్చారు. అలాగే జిల్లా కలెక్టరు నేరుగా వెళ్లి బాలిక ఇంటికి సోలార్ దీపం ఏర్పాటు చేయించడంతో పాటు రూ.10 వేల సాయం కూడా అందించారు. నటుడు శివకార్తికేయన్ సాయంతో నీట్ శిక్షణలో చేరిన సహానా ఈ ఏడాది నీట్ పరీక్షల్లో 273 స్కోరుతో జనరల్ కేటగిరీలో 120వ ర్యాంకుతో ఉత్తీర్ణత పొందింది. తిరుచ్చి ప్రభుత్వ వైద్యకళాశాలలో ఆమెకు సీటు కూడా లభించింది. ఇప్పుడు నటుడు కార్తికేయన్ సాయాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.