ఉల్క రూపంలో రాత్రికి రాత్రే వరించిన అదృష్టలక్ష్మి
యమలీల సినిమా గుర్తుందిగా… యమలోకం నుంచి హఠాత్తుగా ‘భవిష్యవాణి’ అనే పుస్తకం హీరో అలీ ఇంట్లో పడుతుంది. అందులోని విషయాలతోనే తర్వాత కథ నడుస్తుంది. హీరోను అదృష్టవంతుణ్ని చేసింది కూడా ఆ పుస్తకమే. రవితేజ హీరోగా నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలోనూ ఇలాంటి సీనే ఉంటుంది. అక్కడా అలీనే పాత్రధారి. బ్రహ్మానందం, కోవై సరళ… విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల వేషధారణలో వైకుంఠం నుంచి డబ్బుల మూట కిందికి పారవేసినా, అలీ చూడకుండా వెళ్లిపోతాడు. అదృష్టాన్ని అందుకోలేకపోతాడు. అందుకే ‘అదృష్టవంతుణ్ని ఎవరూ పాడు చేయలేరు… దురదృష్టవంతుణ్ని ఎవరూ బాగుచేయలేరు’ అనేది సామెత పుట్టింది.
అదృష్టలక్ష్మి వరించిన వ్యక్తుల ఉదంతాలెన్నో మీరు చూసి ఉండవచ్చు. విని ఉండవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే గాధ మాత్రం కచ్చితంగా కొత్తదే. పై నుంచి దేవుడే వరమిచ్చాడా అనేంతటి వింత యదార్థమిది.
ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లోని ఉత్తర ప్రాంతం. జాషువా హుతాగలంగ్ వయసు 33 ఏళ్లు. భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. ఇటీవల ఒకరోజు అతడి ఇంట్లోకి పై నుంచి ఏదో ధబ్ అంటూ పడినట్లుగా పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా అని కంగారు పడి చూసేసరికి నట్టింట్లో సుమారు 2 కిలోల బరువుండే రాయి ఒకటి పడి ఉంది. పట్టుకుని చూస్తే కాస్త వేడిగా ఉంది. ఇంత పెద్ద రాయి ఎవరు విసిరారు? అని ఆలోచిస్తూ పైకి చూసేసరికి పై కప్పు చిల్లు పడి కనిపిస్తోంది. దానికితోడు రాయి పడిన చోట బలంగా విసిరినట్టు నేలపై సుమారు 15 సెంటీమీటర్ల లోతున గుంత పడింది. కాసేపు జాషువా పరిశీలనాత్మకంగా చూసి… అది ఉల్క అయి ఉండవచ్చని అంచనా వేశాడు. మర్నాడు సంబంధిత నిపుణులను సంప్రదించగా, అది ఉల్కనే అని తేలింది. అది మామూలు ఉల్క కాదండోయ్… 4.5 కోట్ల సంవత్సరాల నాటిదట. అందులో అత్యంత అరుదైన ఖనిజాలున్నాయని నిపుణులు గుర్తించారు. అది గ్రాము ధర సుమారు 853 డాలర్ల (సుమారు 63 వేల రూపాయలు) ఖరీదు ఉంటుందట. మొత్తం ఆ ఉల్క రాతి బరువు తూచి దాదాపు 18 లక్షల అమెరికన్ డాలర్ల(రూ. 13 కోట్ల) ఖరీదు చేస్తుందని లెక్క కట్టారు. అబ్బ… జాషువా ఇంటిపై పడిన రాయి ఎలా రత్నంగా మారిందో చూశారా.