బ‌క్క రైతుల‌కు వ‌జ్రాలు దొరికాయోచ్‌

పొలాల‌న‌న్నీ హ‌లాల దున్నీ… ఇలా త‌లంలో హేమం పిండ‌గ‌… అంటూ క‌ర్ష‌కుల శ్రామిక శ‌క్తిని త‌న క‌వ‌నంలో ఉత్సాహ‌ప‌రిచారు మ‌హాక‌వి శ్రీశ్రీ. వ్య‌వ‌సాయంతో బంగారం పండించ‌డం కొద్ది మంది రైతుల‌కే సాధ్య‌మ‌ని అప్పుడ‌ప్పుడు వెలువ‌డే దృష్టాంతాలు నిరూపిస్తుంటాయి. ఇక్క‌డ క‌థ వేరు. ఇద్ద‌రు బ‌క్క రైతులు త‌మ భూముల్లో వజ్రాల కోసం ఏళ్ల త‌ర‌బ‌డి చెమ‌టోడ్చి త‌వ్వుతుంటే… భూమి త‌ల్లి ఇన్నాళ్ల‌కు వాళ్ల‌ని క‌రుణించింది. రాత్రికి రాత్రి ల‌క్షాధికారుల‌ను చేసేసింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బాగా వెనుక‌బ‌డిన ప్రాంతం బుందేల్‌ఖండ్‌. అక్క‌డి ప‌న్నా జిల్లా వ‌జ్రాల గ‌నుల‌కు ప్ర‌సిద్ధి. ద‌శాబ్దాలుగా ప్ర‌యివేటు కంపెనీలు అక్క‌డ మైనింగ్ లీజులు పొంది వ‌జ్రాల‌ను వెలికి తీస్తున్నాయి. ఆ ప్రాంతాల్లోని సాధార‌ణ రైతుల భూముల్లోనూ అరుదుగా వ‌జ్రాలు బ‌య‌ట‌ప‌డ‌డం క‌ద్దు. రెండు వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన రైతులు త‌మ‌కున్న చిన్న క‌మ‌తాల్లో కొన్నేళ్లుగా సాగిస్తున్న అన్వేష‌ణ ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. ఇద్ద‌రికీ చెరో వ‌జ్రం దొరికాయి. వారిలో జ‌రువాపూర్‌కు చెందిన దిలీప్ మిస్త్రీ అనే రైతుకు 7.44 క్యార‌ట్లు, క‌ల్యాణ్‌పూర్ ప్రాంతానికి చెందిన ల‌ఖ‌న్ యాద‌వ్ కు 14.98 క్యార‌ట్ల వ‌జ్రం ల‌భించాయి. మొద‌టిది రూ. 30 ల‌క్ష‌లు, రెండోది అంత‌కు రెట్టింపు ధ‌ర ప‌ల‌క‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. అయితే మొత్తం విలువ క‌ట్టాక‌, ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం 12.5 శాతం మొత్తాన్ని రాయ‌ల్టీగా మిన‌హాయించి మిగిలిన‌ది మాత్ర‌మే వారికి చెల్లిస్తార‌ట‌. ఏదైతేనేం ల‌క్ష‌ల విలువైన వజ్రాలు ఆ ఇద్ద‌రు రైతుల క‌ళ్ల‌ల్లో కొత్త కాంతులు నింపాయి.

Leave a Reply

Your email address will not be published.