తొలి వర్ధంతి వేళ కొడుకు మైనపు బొమ్మ ఆవిష్కరణ
అపురూపంగా చూసుకున్న కుమారుడు మరణించడంతో అతను నిత్యం తమ కళ్లెదుటే ఉండాలనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు అతడి మైనపు విగ్రహం ఏర్పాటు చేయించిన ఉదంతం తమిళనాట చోటుచేసుకుంది. తమిళనాడులోో మదురైలోని అవనియాపురం ప్రాంతానికి చెందిన మురుగేశన్, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, మారి గణేశ్ అనే ఓ కుమారుడు ఉన్నారు. మోటారు బైక్ రేసులో ఆసక్తి ఉన్న మారి గణేశ్ గోవా, ముంబయి, దిల్లీ, బెంగళూర్ తదితర నగరాల్లో జరిగిన పలు రేసుల్లో పాల్గొని పతకాలు, పురస్కారాలు సాధించాడు. పదేళ్ల కిందట పెళ్లయిన ఆయన గత ఏడాది నవంబరు 18న అనారోగ్యంతో మరణించాడు. అప్పటికి అప్పటికి ఆయన వయసు 31 ఏళ్లు మాత్రమే. చెట్టంత కొడుకు దూరమైన కన్నవారి మనోవేదన చెప్పనలవి కానిది. కనుమరుగైన కుమారుడు ఇక ఎప్పటికీ తిరిగి రాడని తెలిసి తల్లడిల్లారు. అతడి రూపం నిత్యం తమ కళ్లముందే ఉండాలన్న ప్రేమతో వారో ఉపాయం ఆలోచించారు. అతడి మైనపు విగ్రహాన్ని తల్లిదండ్రులు రూ.6 లక్షల వ్యయంతో చేయించారు. దానిని అవనియాపురంలోని తమ కల్యాణ మండపంలో ఉంచి కుమారుడి తొలి వర్ధంతి రోజైన బుధవారం ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంతో అపురూపంగా చూసుకున్న కుమారుడు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, అందువల్ల అతని రూపం తమ కళ్లెదుటే ఎప్పడూ ఉండేలా ఈ మైనపు బొమ్మను చేయించామని మురుగేశన్ తెలిపారు. ప్రతి ఏడాది కుమారుడి వర్ధంతికి సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
—