అరుణాచల జ్యోతి దర్శనం … చూసిన కనులదే భాగ్యం
గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం… అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.
కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచల గిరిపైన మహా జ్యోతిని ప్రజ్వలింపజేస్తారు. దీనినే ” కృత్తికా దీపోత్సవం ” అంటారు. ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో చేయబడుతుంది. ఈ ప్రమిదను, వత్తిని ” జ్యోతి నాడార్ లేక దీప నాడార్ ” అని పిలువబడే వంశస్తులు మాత్రమే అందజేస్తారు. ఇక 2500 కిలోల నెయ్యి అరుణాచలానికీ వచ్చే భక్తులు అందజేస్తారు. అలా వెలిగించిన అరుణాచల మహా దీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. సుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపం దర్శనమిస్తుంది. ఈ ఏడాది నవంబరు 29న కృత్తికా నక్షత్రం కావడంతో ఆ రోజు దీపోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ఏటా ఈ కృత్తికాదీప ప్రజ్వలన ఓ మహాయజ్జంలాగే సాగుతుంది. 25 క్వింటాళ్ల నెయ్యి, పెద్ద రాగి ప్రమిద, ఇతరత్రా సంభారాలన్నీ కొండపైకి చేర్చడం ప్రయాసభరితం. అయినా శివనామస్మరణ ఘోషల నడుమ భక్తులు, కార్మికులు ఆ పనిని మహదానందంగా పూర్తి చేస్తారు. వీలైతే అరుణాచలం వెళ్లి ప్రత్యక్షంగా జ్యోతిని దర్శించు కోవడం అత్యంత పుణ్యప్రదం. ఈ జ్యోతిని దర్శించేందుకు దేశ విదేశాలలో ఉండే భక్తులు కూడా అరుణాచలం చేరుకుంటారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతం విచ్చేస్తుంటారు.
స్మరణాత్ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు.
కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు.

అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాలనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని గుర్తించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.