8 రోజుల్లో 3600 కి.మీ. సైకిల్ తొక్కేశాడు…

కాశ్మీరు నుంచి కన్యాకుమారికి బాలుడి రికార్డు స్థాయి యాత్ర

ఆ కుర్రాడికి నిండా 18 ఏళ్లు కూడా లేవు… కానీ భారతదేశంలో వేగవంతమైన సైకిల్ యాత్ర రికార్డును బద్దలుకొట్టాడు. మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి చెందిన 17 ఏళ్ల ఓమ్ మహాజన్ శనివారం అరుదైన రికార్డు సృష్టించాడు. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు 3600 కిలోమీటర్ల దూరం సైకిలుపై ప్రయాణాన్ని కేవలం 8 రోజుల ఏడు గంటల 38 నిమిషాల్లో పూర్తి చేశాడు. గత వారం వణికించే చలిలో శ్రీనగర్లో బయలుదేరిన అతడు మధ్యప్రదేశ్ లో భారీవర్షాలు, దక్షిణానికి వచ్చే కొద్దీ పెరిగిన వేడిమిని తట్టుకుంటూ శనివారం మధ్యాహ్నానికి కన్యాకుమారి చేరాడు. ప్రపంచంలోనే క్లిష్టమైనదిగా పేరున్న రేస్ ఎక్రాస్ అమెరికా (RAAM)లో పాల్గొనాలన్న అతడి లక్ష్యంపై దృష్టి సారిస్తున్నాడు. నవంబరులో జరగాల్సిన RAAM క్వాలిఫయర్ రైడ్ కోసం ఆరు నెలల కిందట సాధన మొదలుపెట్టాడు ఓమ్. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో… 600 కిలోమీటర్ల ఆ రైడ్ కు బదులు అంతకు ఆరింతల పెద్దదైన భారత యాత్రకు సంకల్పించాడు.

శ్రీనగర్-కన్యాకుమారి నడుమ వేగవంతమైన సైకిల్ యాత్ర గిన్నిస్ రికార్డు ఓమ్ పినతండ్రి మహేంద్ర మహాజన్ పేరిటే ఉండడం విశేషం. కానీ ఆ రికార్డును ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భారత్ పన్ను ఇటీవలే 8 రోజుల తొమ్మిది గంటల్లో అధిగమించి మహేంద్ర రికార్డును బ్రేక్ చేశాడు. అది ఇంకా గిన్నిస్ పుస్తకంలో నమోదు కావాల్సి ఉంది. అంతలోనే దాన్ని ఓమ్ బద్దలుకొట్టడం విశేషం. ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా ఓమ్ ను వేగంగా అభినందించిన వ్యక్తి భారత్ పన్ను కావడం ముదావహం. ఓమ్ తండ్రి హితేంద్ర, బాబాయ్ మహేంద్రలు 2015లో RAAM రేస్ ను బృందంగా గెలిచారు. వీళ్లిద్దరితో పాటు RAAM రేస్ ను గతంలో ఒంటరిగా పూర్తి చేసిన కబీర్ రాయ్ చూర్ సహా కొందరు అనుభవజ్ఞులైన సైక్లిస్టులు ఓమ్ వెంట మరో వాహనంలో వెన్నంటి పయనించారు. కనీసం నిద్రపోవడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం కూడా కుదరలేదని, ఈ విజయం తనను నడిపించిన బృందానిదేనని ఓమ్ చెప్పాడు. అతడి తదుపరి లక్ష్యం ‘రేస్ అక్రాస్ అమెరికా’నే. దాన్ని సాధించాలంటే కేవలం 12 రోజుల్లో 4800 కిలోమీటర్లు ప్రయాణించగలగాలి. ఓమ్ ఉత్సాహం చూస్తుంటే దాన్ని సాధించగలడనిపిస్తోంది కదూ… అందుకే అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Leave a Reply

Your email address will not be published.